ప్రతిపక్షం, జూన్ 01: ప్రైవేటు, కాంట్రాక్ట్ కార్మికుల వేతనాల చెల్లింపుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నగదు రూపంలో జీతాలు చెల్లించడాన్ని నిషేధిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై అన్ని రంగాల్లో పనిచేసే ఉద్యోగులు, కార్మికుల వేతనాలు నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.
కొత్త నిబంధనల ప్రకారం కనీస వేతనాలను నిర్దిష్ట వ్యవధుల్లో సమీక్షించి పెంచే చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అలాగే ప్రభుత్వ సెలవు రోజుల్లో లేదా ప్రత్యేక సెలవు దినాల్లో పనిచేసే కార్మికులకు సాధారణ వేతనానికి రెండింతల పారితోషికం చెల్లించాలని ఆదేశించింది.
కాంట్రాక్ట్ కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మరో ముఖ్యమైన నిబంధనను ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. కాంట్రాక్టర్ లేదా థర్డ్ పార్టీ సంస్థలు వేతనాల చెల్లింపులో జాప్యం చేసినా, చెల్లించకపోయినా సంబంధిత ప్రధాన సంస్థ బాధ్యత వహించి కార్మికులకు జీతాలు చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొంది.
ఈ నిర్ణయంతో వేతనాల చెల్లింపులో పారదర్శకత పెరగడంతో పాటు కాంట్రాక్ట్ కార్మికుల హక్కులకు మరింత రక్షణ లభిస్తుందని కార్మిక సంఘాలు అభిప్రాయపడుతున్నాయి.


















