- వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలకు ప్రోత్సాహం
- ఎఫ్డీఆర్ సైన్స్ సెంటర్ ప్రారంభోత్సవంలో మంత్రి శ్రీధర్ బాబు
ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, ఉత్తర తెలంగాణ, జూలై 15: రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని… ఆ దిశగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. విద్య, వైద్య రంగాలకు అత్యంత ప్రాధాన్యమిస్తూ… విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, సృజనాత్మకతను పెంపొందించేలా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అల్వాల్ జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఎఫ్డీఆర్) సహకారంతో ఏర్పాటు చేసిన ఎఫ్డీఆర్ సైన్స్ సెంటర్ ను బుధవారం ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ… వినూత్న ఆలోచనలు, ఆవిష్కరణలకు ఊతమిచ్చేలా రాష్ట్రంలో సమగ్ర ఇన్నోవేషన్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేస్తున్నామన్నారు. కొత్త ఐడియాలను ఆవిష్కరణలుగా… వాటిని సమాజానికి ఉపయోగపడే ఉత్పత్తులుగా తీర్చిదిద్దేందుకు టీ-హబ్, టీ-వర్క్స్, వీ-హబ్ ద్వారా అవసరమైన సహకారం అందిస్తున్నామన్నారు. నేటి ప్రపంచంలో అకడమిక్ డిగ్రీల కంటే కొత్త ఆలోచనలు, నైపుణ్యాలకు ఎక్కువ విలువ ఉందని… సృజనాత్మకతే విజయానికి అసలైన పునాది అని విద్యార్థులకు మార్గనిర్దేశం చేశారు. సైన్స్ అంటే ప్రశ్నించడం, కారణాలను అన్వేషించడమేనని… మన చుట్టూ ఉన్న సమస్యలను శాస్త్రీయ దృక్పథంతో పరిశీలించి, వాటికి పరిష్కారాలు కనుగొనేందుకు ప్రయత్నించాలని వారికి సూచించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తరహా సైన్స్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని ఎఫ్డీఆర్ సంస్థ ప్రతినిధులను మంత్రి శ్రీధర్ బాబు కోరారు. ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీలు ఈటెల రాజేందర్, విజయేంద్ర ప్రసాద్, ఎఫ్డీఆర్ జనరల్ సెక్రటరీ జయప్రకాశ్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.
- ఎఫ్ డీఆర్ సైన్స్ సెంటర్ ప్రారంభం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా అల్వాల్ జడ్పీ హై స్కూల్(బాలికలు)లో “ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్” సహకారంతో ఏర్పాటు చేసిన ఎఫ్ డీఆర్ సైన్స్ సెంటర్ ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో ఎంపీలు ఈటెల రాజేందర్, విజయేంద్ర ప్రసాద్, “ఫౌండేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్” జనరల్ సెక్రటరీ జయప్రకాశ్ నారాయణ్ తదితరులు పాల్గొన్నారు.



















