తెలంగాణ జేఏసీ నాయకులు కొండల్ రెడ్డి యాదగిరి.
ప్రతిపక్షం ప్రతినిధి మెదక్ జూలై 15: తెలంగాణ ఉద్యమకారులను గుర్తించి వారి సంక్షేమం కోసం ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని మెదక్ జిల్లా జేఏసీ సమన్వయ కమిటీ నాయకులు కొండల్ రెడ్డి, సడిమెల యాదగిరి, తెలిపారు .మెదక్ జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడం కోసం కే కేశవరావు గారి నాయకత్వంలో గుర్తింపు కమిటీ నియమించడంపై వారు హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు – గౌరవం – సంక్షేమంపై సంప్రదింపుల సమావేశం జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ అభిప్రాయ సేకరణ చేయడం మంచి పరిణామమని వారు తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారులను స్థానిక జేఏసీ నాయకులు గుర్తించిన వారిని పరిగణలోకి తీసుకోవాలని కోరినారు. తెలంగాణ ఉద్యమంలో వేలాది మంది విద్యార్థులు, యువకులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రైతులు, కార్మికులు, కవులు కళాకారులు, జర్నలిస్టులు మహిళలు పాల్గొని రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేశారని వారు తెలిపారు. ఉద్యమ సమయంలో పెట్టిన కేసులను విరమించుకోవాలని, కోరినారు.ఉద్యమంలో పాల్గొన్న అనేక మంది ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులతో జీవిస్తున్నారు, గ్రామీణ స్థాయిలో ఉద్యమాన్ని ముందుకు నడిపించిన కార్యకర్తలను గుర్తించి వారందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి, ఉద్యమకారులు గుర్తించబడిన నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. సంక్షేమ పథకాలలో అవకాశాలు కల్పించాలి . ఉద్యమకారులుగా గుర్తించబడిన వారిలో కొందరు రాజకీయ నాయకులుగా కొనసాగుతున్న వారికి నామినేటెడ్ పదవులలో అవకాశాలు ఇవ్వాలి. వ్యవసాయదారులుగా ఉన్న ఉద్యమకారులకు సబ్సిడీలపై వ్యవసాయం యంత్ర పరికరాలను ఇవ్వాలి.
1969 తొలి దశ ఉద్యమంలో పాల్గొని పోలీస్ కేసులు, జైల్లో నిర్బంధించబడిన వారి వివరాలను ప్రభుత్వమే సేకరించి వారి కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకోవాలి. ఉద్యమకారులందరికి కార్పొరేట్ వైద్యశాలల్లో ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలి. గత ప్రభుత్వంలో విస్మరించబడిన వారికి ఉద్యమము లో చనిపోయినవారికి వారి కుటుంబము లో ఒకరికి ఉద్యోగము ఇవ్వాలి. గత ప్రభుత్వంలో విస్మరించబడిన కళాకారులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఇండ్లు లేని వారికి
250 గజాల ప్లాట్ ఇవ్వాలి. గుర్తించబడిన ఉద్యమకారులందరికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాలును కల్పించాలి. జిల్లాల వారీగా మలిదశ ఉద్యమంలో జరిగిన కార్యక్రమాలు అన్నింటిని పొందుపరుస్తూ వాటిలో పాల్గొన్న ఉద్యమకారులందరి కోరుకుంటూ ఉద్యమ చరిత్రను రాయాలని వారు కోరారు.

















