ప్రతిపక్షం, జూలై 15: తెలంగాణను అభివృద్ధి చెందిన మోడల్ రాష్ట్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో 2034 నాటికి నిర్దేశించిన అభివృద్ధి లక్ష్యాల సాధనకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. భారత్ ఫ్యూచర్ సిటీలో అమెజాన్ వెబ్ సర్వీసెస్ నిర్మించనున్న దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్‌కు సీఎం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
సీఎం మాట్లాడుతూ.. అమెజాన్ డేటా సెంటర్ ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తొలి మెట్టుగా నిలుస్తుందని పేర్కొన్నారు. 2034 నాటికి తెలంగాణలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టాలని అమెజాన్‌ను కోరినట్లు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించేందుకు సింగిల్ విండో విధానంలో అనుమతులు ఇస్తున్నామని, ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేస్తుందని స్పష్టం చేశారు.
2034 నాటికి తెలంగాణను 1 ట్రిలియన్ డాలర్ల, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని సీఎం వెల్లడించారు. ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ 5 శాతం వాటా కలిగి ఉండగా, 2047 నాటికి దానిని 10 శాతానికి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. ఈ లక్ష్యాల సాధనకు పెట్టుబడులు, మౌలిక సదుపాయాల విస్తరణ, ఉద్యోగాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని వివరించారు.
భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రపంచ ప్రఖ్యాత ఫార్చూన్–500 సంస్థలను ఆహ్వానించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టామని, తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నామని తెలిపారు. వచ్చే 14 ఏళ్లలో అమెజాన్ రాష్ట్రంలో 7 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనుందని, వాటి అమలును ప్రతి నెలా స్వయంగా సమీక్షిస్తానని సీఎం హామీ ఇచ్చారు.
హైదరాబాద్‌ను కాలుష్య రహిత, భవిష్యత్ అవసరాలకు అనుగుణమైన నగరంగా తీర్చిదిద్దేందుకు ఈవీలకు జీరో ట్యాక్స్ అమలు చేస్తున్నామని, డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని చెప్పారు. మూసీ ప్రక్షాళన, కాలుష్య నియంత్రణ, నగర ప్రణాళికపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు.
అలాగే ఓఆర్‌ఆర్ లోపల సేవారంగం, ఓఆర్‌ఆర్–ఆర్ఆర్‌ఆర్ మధ్య ప్రాంతాన్ని తయారీ కేంద్రంగా, ఆర్ఆర్‌ఆర్ వెలుపల ప్రాంతాన్ని వ్యవసాయ ఆధారిత ఆర్థిక మండలంగా అభివృద్ధి చేయాలనే సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రైతుల త్యాగాలను ప్రభుత్వం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని, భూసేకరణలో మరింత మెరుగైన నష్టపరిహారం, భరోసా కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.




















