ప్రతిపక్షం, జూన్ 01: రైతు డిస్కం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విద్యుత్ పంపిణీ సంస్థను ఏర్పాటు చేసి, ప్రస్తుతం ఉన్న విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరించే దిశగా అడుగులు వేస్తోందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఈ నిర్ణయం రైతుల ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొంటూ ప్రభుత్వం తన వైఖరిని బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.రైతులకు ఉచిత విద్యుత్ కొనసాగుతుందా, మోటార్లకు మీటర్లు ఏర్పాటు చేయరా అనే అంశాలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని ఆమె కోరారు. రైతు డిస్కం ప్రతిపాదనపై విద్యుత్ నియంత్రణ మండలి రైతుల అభిప్రాయాలను సేకరించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు.రైతులకు నష్టం కలిగించే నిర్ణయాలకు తాము వ్యతిరేకమని స్పష్టం చేసిన కవిత, రైతు డిస్కానికి అనుమతి ఇస్తే న్యాయపరమైన పోరాటం చేపడతామని తెలిపారు. ఇప్పటికే ఈ అంశంపై తెలంగాణ జాగృతి తరఫున న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు వెల్లడించారు. పాలమూరు ప్రాజెక్టు పనులను వేగవంతం చేసి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని దసరా నాటికి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. అలాగే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న చిన్నారి కుటుంబానికి ప్రభుత్వం తగిన సహాయం అందించాలని కోరారు.



























