ప్రతిపక్షం, జూన్ 02: తెలంగాణలో ఇటీవల చోటుచేసుకున్న రాజకీయ వివాదాలపై జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక రాజకీయ విశ్లేషకుడి వ్యాఖ్యలతోనే ఈ వివాదానికి ఆరంభమైందని అన్నారు.
“ఆ విశ్లేషకుడిపై నాకు గౌరవం ఉంది. నేను అమిత్ షాతో ఏదో మాట్లాడినట్లు ఆయన ఒక మీడియా వేదికలో చెప్పారని, ఆ వ్యాఖ్యలను నేను వెంటనే ఖండించాను” అని పవన్ తెలిపారు.
అయితే అదే అంశాన్ని మళ్లీ ప్రస్తావిస్తూ ప్రాంతీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. “తెలంగాణ ఏర్పడి 12 సంవత్సరాలు అయింది. ఇంకా ఆంధ్ర ప్రజలనే నిందిస్తూ ఎంతకాలం రాజకీయాలు చేస్తారు?” అని ప్రశ్నించారు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజల మధ్య విభేదాలు లేవని, రెండు రాష్ట్రాల ప్రజలు పరస్పర గౌరవంతో కలిసి జీవిస్తున్నారని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రాంతీయ విద్వేషాల కంటే అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపైనే రాజకీయ చర్చలు జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.

















