పవన్ కల్యాణ్.. హుందాగా వ్యవహరించాలి :సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ

ప్రతిపక్షం, జూన్ 04: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తన హోదాలకు తగిన విధంగా హుందాగా వ్యవహరించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ సూచించారు. రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టాల్సిన సమయంలో తెలుగు రాష్ట్రాల మధ్య ప్రాంతీయ విభేదాలు పెరిగేలా వ్యాఖ్యలు చేయడం సరికాదని విమర్శించారు.

ఇటీవల రాజకీయ విశ్లేషకుడు నాగేశ్వర్‌ చేసిన వ్యాఖ్యలపై భిన్నాభిప్రాయాలు ఉంటే ప్రజాస్వామ్య పద్ధతిలో స్పందించాల్సిందని, కేసులు నమోదు చేయడం సరైన విధానం కాదన్నారు. ఈ వివాదం రెండు రాష్ట్రాల మధ్య అనవసర ఉద్రిక్తతలకు దారితీసిందని పేర్కొన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున హైదరాబాద్‌లో పవన్‌ నిర్వహించిన మీడియా సమావేశం వివాదాన్ని మరింత పెంచిందని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టడం బాధ్యతాయుత నాయకత్వానికి తగదన్నారు.

కమ్యూనిజంపై పవన్‌ చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఖండించారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిస్టు ఉద్యమాలు కొనసాగుతున్నాయని, ఎన్నికల ఫలితాల ఆధారంగా సిద్ధాంతాలను కొట్టిపారేయడం సమంజసం కాదని చెప్పారు.

ఏపీ ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాలు, తన శాఖల బాధ్యతలపై పవన్‌ ఎక్కువ దృష్టి సారించాలని, వివాదాస్పద వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని రామకృష్ణ హితవు పలికారు. రాజకీయాల్లో సంయమనం, బాధ్యత అవసరమని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News