తెలంగాణ ఎస్సీ విద్యార్థుల సమగ్రాభివృద్దే లక్ష్యం

కేంద్ర మంత్రి రాందాస్ తో మంత్రి అడ్లూరి భేటీ

రూ.300 కోట్ల ప్రత్యేక ప్యాకేజీ పై కేంద్ర మంత్రి కి విజ్ఞప్తితక్షణమే రూ.150 కోట్ల విడుదలకు అంగీకారం

ప్రతిపక్షం స్టేట్ బ్యూరో, ఉత్తర తెలంగాణ, జూలై 15: తెలంగాణలో షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల మెరుగుదల, సంక్షేమ విద్యాసంస్థలు, వసతి గృహాల సమగ్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి శ్రీ రామ్‌దాస్ అథవాలే భరోసా ఇచ్చారు.రాష్ట్రానికి పెండింగ్‌లో ఉన్న నిధుల నుంచి తక్షణమే రూ.150 కోట్ల విడుదలకు సానుకూలంగా స్పందించినట్లు, అలాగే షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్ల అభివృద్ధికి ప్రతిపాదించిన రూ.300 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీపై వచ్చే నెలలో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చినట్లు రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి శ్రీ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు.

హైదరాబాద్ పర్యటనలో భాగంగా బుధవారం టూరిజం ప్లాజాలో కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలేను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమగ్ర వినతిపత్రాన్ని సమర్పించారు. రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల విద్యార్థుల సంక్షేమం, విద్యా ప్రమాణాల పెంపు, సంక్షేమ విద్యాసంస్థల ఆధునీకరణ, కేంద్ర ప్రాయోజిత పథకాల సమర్థ అమలుకు అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందించాలని కోరారు.ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ… ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పరిపాలనకు కేంద్రబిందువుగా తీసుకుని షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు. విద్యనే సామాజిక సాధికారతకు ప్రధాన ఆయుధంగా భావిస్తూ గురుకుల విద్యా వ్యవస్థ, సంక్షేమ హాస్టళ్లు, విద్యార్థుల సంక్షేమ పథకాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని డైట్ ఛార్జీలను 40 శాతం పెంచడం, 16 సంవత్సరాల తర్వాత కాస్మెటిక్ ఛార్జీలను 212 శాతం పెంచడం, హాస్టళ్ల నిర్వహణకు భారీగా నిధులు విడుదల చేయడం, ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించడం, ఆధునిక విద్యా అవకాశాలను విస్తరించడం వంటి పలు కీలక నిర్ణయాలు తీసుకుందని వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు సంక్షేమ విద్యాసంస్థల ద్వారా నాణ్యమైన విద్యను అభ్యసిస్తున్నప్పటికీ, కేంద్ర ప్రాయోజిత పథకాల కింద తెలంగాణకు రావాల్సిన నిధులు పెండింగ్‌లో ఉండటం వల్ల సంక్షేమ కార్యక్రమాల అమలుపై అదనపు ఆర్థిక భారం పడుతోందని మంత్రి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా రాష్ట్రంలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాల్లో భవనాల మరమ్మతులు, అదనపు తరగతి గదుల నిర్మాణం, హాస్టళ్ల విస్తరణ, డైనింగ్ హాళ్లు, ఆధునిక వంటశాలలు, పరిశుభ్రమైన మరుగుదొడ్లు, సురక్షిత తాగునీటి సదుపాయాలు, ప్రహరీ గోడలు, విద్యుద్దీకరణ, డిజిటల్ తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్‌లు, స్మార్ట్ లెర్నింగ్ సదుపాయాల కల్పన అత్యవసరమని వివరించారు.ఈ నేపథ్యంలో తెలంగాణలోని షెడ్యూల్డ్ కులాల సంక్షేమ పాఠశాలలు, హాస్టళ్ల సమగ్ర ఆధునీకరణ కోసం రూ.300 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ మంజూరు చేయాలని వినతిపత్రంలో కోరినట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రత్యేక నిధులతో విద్యార్థులకు మరింత సురక్షితమైన, ఆధునికమైన, నాణ్యమైన విద్యా వాతావరణాన్ని కల్పించడంతో పాటు విద్యా ఫలితాలను మరింత మెరుగుపరచడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

తెలంగాణ ప్రభుత్వం షెడ్యూల్డ్ కులాల విద్య, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, వసతి, సామాజిక సాధికారత రంగాల్లో అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం నిరంతర సహకారం అందించాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తున్న కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరాలంటే కేంద్ర ఆర్థిక సహకారం అత్యంత అవసరమని వివరించారు.మంత్రి సమర్పించిన వినతిపత్రంపై కేంద్ర మంత్రి శ్రీ రామ్‌దాస్ అథవాలే సానుకూలంగా స్పందించినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. తెలంగాణకు రావాల్సిన పెండింగ్ కేంద్ర నిధుల్లో తొలి విడతగా రూ.150 కోట్లను తక్షణమే మంజూరు చేసేలా చర్యలు తీసుకుంటామని, అలాగే రూ.300 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రతిపాదనపై వచ్చే నెలలో సంబంధిత అధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.అదేవిధంగా షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతి, విద్యా అభివృద్ధి, సామాజిక సాధికారత కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని కేంద్ర మంత్రి రామ్‌దాస్ అథవాలే హామీ ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. అలాగే ఎస్సీ అట్రాసిటీ కేసుల్లో బాధితులకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని కూడా కేంద్ర మంత్రి స్పష్టం చేసినట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శి విజయేంద్ర బోయి, ఎస్సీ కార్పొరేషన్ జిఎమ్ హనుమంత్ నాయక్, మల్లయ్య భట్టు వీసీ &ఎండీ ఎస్సీ, బీసీ కార్పొరేషన్, ఎస్సీ స్టడీ సెంటర్ డైరెక్టర్ నర్సింహారెడ్డి, టీజీస్వరెస్ జాయింట్ సెక్రెటరీ అడ్మిన్ సక్రు నాయక్, వికలాంగుల సంక్షేమ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ తో పాటు వివిధ సంక్షేమ శాఖల ఉన్నత అధికారులు పాల్గొన్నారు.

Spread the love

Related News

Latest News