ప్రతిపక్షం, జూలై 16: ఆషాఢ మాస బోనాల ఉత్సవాల నేపథ్యంలో గోల్కొండలోని శ్రీ జగదాంబ మహంకాళి దేవాలయంలో నిర్వహించనున్న బోనాల ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు. గురువారం నుంచి ఆషాఢ బోనాల ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మంత్రి కొండా సురేఖ, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావుతో పాటు ఆలయ ఈవో, పూజారులు, ధర్మకర్తల మండలి సభ్యులు ముఖ్యమంత్రిని కలిశారు.
జూబ్లీహిల్స్‌లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన ప్రతినిధి బృందం బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డికి అధికారికంగా ఆహ్వానం అందించింది. ఈ సందర్భంగా ఉత్సవాల ఏర్పాట్లు, భక్తులకు కల్పించాల్సిన సౌకర్యాలు, భద్రతా చర్యలపై చర్చించినట్లు తెలుస్తోంది.
ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో ఘనంగా నిర్వహించే గోల్కొండ బోనాల ఉత్సవాలకు తెలంగాణలో ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. బోనాల ఉత్సవాలు ప్రారంభమైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అమ్మవారి ఆలయాల్లో ప్రత్యేక పూజలు, బోనాల సమర్పణ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

















