ప్రతిపక్షం, జూలై 16: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో లోక్‌సభ సెక్రటేరియట్ ఎంపీలకు పలు కీలక సూచనలు చేసింది. సమావేశాలకు హాజరయ్యే ఎంపీలు స్మార్ట్‌వాచ్‌లు, స్మార్ట్ గ్లాసులు వంటి పరికరాలను ఉపయోగించవద్దని సూచించింది. ఈ పరికరాల వినియోగం వల్ల వ్యక్తిగత గోప్యతకు, పార్లమెంట్ భద్రతకు ముప్పు ఏర్పడే అవకాశం ఉందని స్పష్టం చేసింది.
అలాగే కృత్రిమ మేధస్సు ద్వారా రూపొందించిన చిత్రాలు, పోస్టర్లు, ఇతర ప్రచార సామగ్రిని పార్లమెంట్ ప్రాంగణంలో ప్రదర్శించవద్దని లోక్‌సభ సెక్రటేరియట్ ఎంపీలను కోరింది. ఎంపీల ఛాంబర్ల ప్రవేశ ద్వారాల వద్ద ఎలాంటి నిరసనలు, ఆందోళన కార్యక్రమాలు నిర్వహించరాదని సూచించింది.
ఈ నెల 20వ తేదీ నుంచి ఆగస్టు 13వ తేదీ వరకు పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు, పార్లమెంట్ ప్రాంగణంలో భద్రతా ప్రమాణాలు, క్రమశిక్షణను పాటించేందుకు సెక్రటేరియట్ ఈ మార్గదర్శకాలను జారీ చేసింది.

















