ప్రతిపక్షం, జూలై 16: తెలంగాణలో గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమికి గల కారణాలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పాలనలో కొన్ని రంగాలు, కొన్ని వర్గాలను పట్టించుకోకపోవడం, పార్టీ నేతల్లో అతివిశ్వాసం పెరగడం కూడా ఓటమికి కారణమైందని ఆయన అంగీకరించారు.
తమకు కళ్లు నెత్తికెక్కినందుకే ప్రజలు బీఆర్ఎస్ను ఓడించారని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ.. వారిని మార్చి ఉంటే పార్టీకి మెరుగైన ఫలితాలు వచ్చేవని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై రైతులు, నిరుద్యోగులు ఆశలు పెట్టుకోవడం కూడా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు.
అయితే తెలంగాణలో బీఆర్ఎస్కు మళ్లీ ప్రజల మద్దతు లభిస్తుందని, భవిష్యత్తులో తిరిగి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ చేసిన తప్పిదాలను సమీక్షించుకుని ప్రజలకు మరింత చేరువగా పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
ఇదే సమయంలో తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టిసీమ నుంచి నీటిని ఎత్తిపోస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంటే.. తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వం మరింత బాధ్యతగా వ్యవహరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.


















