తెలంగాణలో భూ రికార్డులకు కొత్త రూపు.. భూభారతి కోసం కొత్త సాఫ్ట్‌వేర్

ప్రతిపక్షం, జూలై 16: తెలంగాణలో భూ రికార్డుల నిర్వహణ వ్యవస్థలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ధరణి పోర్టల్‌కు సంబంధించిన పాత కోడింగ్‌ను పూర్తిగా తొలగించి, భూభారతి కోసం కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భూ రికార్డుల డిజిటలైజేషన్‌ను మరింత పటిష్ఠంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు కొత్త వ్యవస్థను అభివృద్ధి చేయనున్నారు.

కొత్త భూభారతి పోర్టల్‌ను మూడు నెలల్లో అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ఇందుకోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నారు. భూ రికార్డుల నిర్వహణ, మార్పులు, భూముల వివరాల నమోదు, పౌరులకు అందించే సేవలను మరింత సులభతరం చేసేలా కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందించనున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో భూ రికార్డుల డిజిటల్ భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. హ్యాకింగ్, సైబర్ దాడులు, అనధికారిక మార్పులను అడ్డుకునేలా పటిష్ఠమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. డిజిటల్ భూ రికార్డులను భద్రంగా నిర్వహిస్తూ.. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే కొత్త వ్యవస్థ ప్రధాన లక్ష్యంగా చెబుతున్నారు.

Spread the love

Related News

Latest News