వైఎస్ షర్మిలకు రాజ్యసభ అవకాశం.. కర్ణాటక నుంచి కాంగ్రెస్ ఎంపిక

ప్రతిపక్షం, జూన్ 01: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సీటు కేటాయించింది. ఈ విషయాన్ని మల్లికార్జున ఖర్గే అధికారికంగా ప్రకటించారు.

కర్ణాటకలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల్లో ఒక స్థానానికి షర్మిలను అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్ఠానం ఎంపిక చేసింది. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజారిటీ ఉండటంతో ఆమె ఎన్నిక దాదాపు ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న షర్మిలకు జాతీయ స్థాయిలో ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో కాంగ్రెస్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. రాజ్యసభకు ఎన్నికైతే పార్లమెంట్‌లో కాంగ్రెస్ తరఫున ఆమె స్వరం వినిపించే అవకాశం లభించనుంది.

ఇటీవల విడుదలైన రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జూన్ 18న పోలింగ్ జరగనుండగా, అదే రోజు ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు. షర్మిల ఎంపికతో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Spread the love

Related News

Latest News