ప్రతిపక్షం, జూలై 16: నీట్ ప్రశ్నపత్రం లీకేజీ వ్యవహారంపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ డిమాండ్ చేసింది. సోనియా గాంధీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. రానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి, దీనిపై సమగ్ర చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు.
అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే డీలిమిటేషన్, రాజ్యాంగ సవరణలు, ‘ఒక దేశం–ఒకే ఎన్నిక’ తదితర ప్రతిపాదిత బిల్లులను వ్యతిరేకించాలని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నిర్ణయించింది. ఈ అంశాలపై ప్రతిపక్షాల వ్యూహాన్ని ఖరారు చేసేందుకు ఎల్లుండి జరగనున్న అఖిలపక్ష సమావేశంలో చర్చించనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి.

















