మక్తల్ ఎత్తిపోతల పనులపై సీఎం రేవంత్ సమీక్ష.. వేగవంతం చేయాలని ఆదేశం

ప్రతిపక్షం, జూన్ 04: తెలంగాణలో సాగునీటి విస్తరణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పురోగతిని ఆయన శుక్రవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే వేలాది ఎకరాలకు సాగునీరు అందడంతో పాటు రైతుల ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని సీఎం పేర్కొన్నారు.

బెంగళూరులో అధికారిక కార్యక్రమాలు ముగించుకుని నేరుగా నారాయణపేట జిల్లా మక్తల్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి, ప్రాజెక్టుకు సంబంధించిన ఫోటో ప్రదర్శన, సాంకేతిక ప్రణాళిక మ్యాపులను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్మాణ దశలు, పనుల పురోగతి, వ్యయ అంచనాలు, నీటి వినియోగ సామర్థ్యం తదితర అంశాలపై నీటిపారుదల శాఖ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు ఎక్కడ ఆలస్యమవుతున్నాయో వివరాలు సేకరించి, వాటిని వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

అనంతరం మక్తల్ మండలం కాట్రేవుపల్లి గ్రామ సమీపంలోని ప్యాకేజీ–1 పనుల ప్రాంతాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి, అక్కడ నిర్మిస్తున్న పంప్‌హౌస్, కాలువలు, అనుబంధ నిర్మాణాలను పరిశీలించారు. ప్రాజెక్టులో కీలకమైన పంప్‌హౌస్ పనులు ఎంత మేరకు పూర్తయ్యాయో అధికారులను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను నాణ్యతతో పాటు నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.

ప్రాజెక్టు పనుల్లో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా వేగవంతంగా ముందుకు సాగాలని సీఎం ఆదేశించారు. ముఖ్యంగా కాంక్రీటు పనులను వెంటనే ప్రారంభించి వేగంగా పూర్తి చేయాలని సూచించారు. రైతులకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకు అనుగుణంగా అధికారులు సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో కొనసాగుతున్న ఇతర నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపైనా సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రాంతంలో సాగునీటి వసతులను మరింత బలోపేతం చేసి వ్యవసాయాభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నీటి కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రాంతాలకు శాశ్వత పరిష్కారం చూపడమే ఈ ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశమని చెప్పారు.

మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తయితే నారాయణపేట, మక్తల్, కొడంగల్ పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ రంగానికి కొత్త ఊపు వస్తుందని అధికారులు వివరించారు. భూగర్భ జలాలపై ఆధారపడే రైతులకు సాగునీటి భరోసా లభించడంతో పంటల ఉత్పాదకత పెరిగే అవకాశం ఉందని తెలిపారు.

ముఖ్యమంత్రి పర్యటనలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, కర్ణాటక మాజీ మంత్రి ఎన్.ఎస్. బోసెరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ప్రాజెక్టు పనులను త్వరగా పూర్తి చేసి రైతుల ఆశలను నెరవేర్చాలని సీఎం అధికారులకు మరోసారి సూచించారు.

Spread the love

Related News

Latest News