ప్రతిపక్షం, జూన్ 04: యాసంగి సీజన్లో రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను ఈ నెల 15వ తేదీ వరకు కొనసాగిస్తామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రైతులు ఇబ్బందులు పడకుండా చివరి గింజ వరకు ధాన్యం కొనుగోలు చేసేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 70.6 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు మంత్రి వెల్లడించారు. ధాన్యం నిల్వలు అధికంగా ఉన్న నిర్మల్, నిజామాబాద్, వికారాబాద్, వనపర్తి, నాగర్కర్నూల్ జిల్లాల్లో కొనుగోలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించిన మంత్రి, ధాన్యం తరలింపు, చెల్లింపుల ప్రక్రియను సకాలంలో పూర్తి చేయాలని స్పష్టం చేశారు.
అలాగే కొనుగోలు కేంద్రాల్లో విధులు నిర్వహిస్తున్న హమాలీలు, స్వీపర్ల సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. వారి వేతనాల పెంపుపై చర్యలు తీసుకుని తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.
రైతులకు మద్దతుగా ప్రభుత్వం పూర్తి స్థాయిలో నిలుస్తుందని, ధాన్యం కొనుగోళ్లలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా పర్యవేక్షణ కొనసాగుతుందని మంత్రి పేర్కొన్నారు.

















