ప్రతిపక్షం, జూన్ 06: తెలంగాణ ప్రభుత్వం విద్యార్థులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనార్టీ, దివ్యాంగ విద్యార్థులకు అందించే స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ఇకపై నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2026–27 విద్యా సంవత్సరం నుంచి ఈ కొత్త విధానాన్ని అమలు చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ప్రస్తుతం ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదలలో జాప్యం కారణంగా విద్యార్థులు, కళాశాలలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్యను పరిష్కరించేందుకు దరఖాస్తు ఆమోదం పొందిన నెల రోజుల్లోనే స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాలను విద్యార్థుల ఖాతాల్లో జమ చేసే విధానాన్ని ప్రభుత్వం రూపొందిస్తోంది.
అయితే ప్రభుత్వం విడుదల చేసిన ఫీజు మొత్తాన్ని విద్యార్థులు వారం రోజుల్లోపు సంబంధిత కళాశాలకు చెల్లించాల్సి ఉంటుంది. నిర్ణీత గడువులోగా ఫీజు చెల్లించకపోతే ఆ మొత్తాన్ని తిరిగి విద్యార్థుల నుంచే వసూలు చేసే నిబంధనను కూడా అమలు చేయనున్నారు.
ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే విద్యార్థుల ఆధార్ కార్డులో ఉన్న పేరు, విద్యా రికార్డుల్లోని పేరు ఒకే విధంగా ఉండాలి. అలాగే ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతా తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆధార్ ధ్రువీకరణ, కళాశాల డిజిటల్ సంతకం, జిల్లా సంక్షేమాధికారి ఆమోదం పూర్తైన తర్వాతే నిధులు విడుదల కానున్నాయి.
స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఈ-పాస్ వ్యవస్థను విద్యాశాఖ డేటాబేస్‌తో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల విద్యార్థుల ప్రవేశాలు, అర్హత వివరాలు నేరుగా అందుబాటులోకి వచ్చి దరఖాస్తుల పరిశీలన వేగవంతం కానుంది.
బకాయిలు పేరుకుపోకుండా ప్రతి నెలా సుమారు రూ.200 కోట్ల నిధులను విడుదల చేసే కార్యాచరణను ప్రభుత్వం పరిశీలిస్తోంది. విద్యా సంవత్సరం ముగిసేలోపు అన్ని స్కాలర్షిప్లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పూర్తిగా చెల్లించడమే లక్ష్యంగా ప్రణాళిక సిద్ధం చేస్తోంది.
అయితే ఈ సదుపాయాలను పొందాలంటే విద్యార్థులు కనీసం 70 శాతం హాజరు నమోదు చేయడం తప్పనిసరి. హాజరు ప్రమాణాలను పాటించిన అర్హులైన విద్యార్థులకే పథకం ప్రయోజనాలు అందనున్నాయి.
సంక్షేమ శాఖలతో చర్చల అనంతరం ఈ ప్రతిపాదనలకు రూపురేఖలు ఖరారయ్యాయి. ఇప్పటికే సంబంధిత ఫైలుకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఆమోదం తెలపగా, త్వరలో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఆమోదం అనంతరం అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని వేలాది మంది విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గి, స్కాలర్షిప్లు సకాలంలో అందే అవకాశం ఏర్పడనుంది.
















