న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. తీర ప్రాంతాలకు సునామీ హెచ్చరిక

ప్రతిపక్షం, జూలై 17: న్యూజిలాండ్‌లో మరోసారి భూకంపం ప్రజలను భయాందోళనకు గురిచేసింది. దేశంలోని దక్షిణ దీవి ప్రాంతంలో గురువారం ఉదయం 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. భూమి బలంగా కంపించడంతో పలు ప్రాంతాల్లో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రం ఫియోర్డ్‌ల్యాండ్‌ ప్రాంతంలోని టె అనౌ పట్టణానికి సుమారు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

భూకంపం సముద్ర ప్రాంతానికి సమీపంలో సంభవించడంతో సునామీ అలలు ఏర్పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. దక్షిణ దీవి పశ్చిమ తీరంలోని మిల్ఫోర్డ్‌ సౌండ్‌ నుంచి ప్యూసెగుర్‌ పాయింట్‌ వరకు తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. సముద్రపు అలలు సాధారణం కంటే ఎత్తుగా వచ్చే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల్లోని ప్రజలు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. సముద్ర తీరానికి వెళ్లవద్దని, పడవల యజమానులు, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకూడదని హెచ్చరించారు.

భూకంపం తర్వాత రహదారులపై రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యవసర వాహనాలకు మార్గం కల్పించాలని అధికారులు కోరారు. ప్రస్తుతం భారీ ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారిక సమాచారం వెలువడలేదు. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు వదంతులను నమ్మకుండా అధికారిక ప్రకటనలను మాత్రమే విశ్వసించాలని సూచించారు.

Spread the love

Related News

Latest News