ప్రతిపక్షం, జూలై 17: ఒడిశాలోని పూరీలో జరుగుతున్న శ్రీ జగన్నాథ రథయాత్రలో విషాద ఘటన చోటుచేసుకుంది. భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీ కారణంగా తొక్కిసలాటలాంటి పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటనలో ఓ వృద్ధ భక్తుడు మృతి చెందగా, పలువురు గాయపడినట్లు సమాచారం.
పూరీ నగరంలోని మారిచికుండ్ కూడలి సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. రథయాత్రను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు ఒకేచోటకు చేరుకోవడంతో ఒక్కసారిగా తీవ్ర రద్దీ నెలకొంది. ఈ క్రమంలో బ్యారికేడ్లపై ఒత్తిడి పెరగడంతో పలువురు భక్తులు కిందపడిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సుమారు 40 నుంచి 50 మంది భక్తులు ఒకేసారి కిందపడటంతో తొక్కిసలాట వాతావరణం ఏర్పడినట్లు సమాచారం.
వెంటనే స్పందించిన పోలీసులు, భద్రతా సిబ్బంది, అత్యవసర సహాయక బృందాలు గాయపడిన వారిని బయటకు తీసి అంబులెన్స్‌ల ద్వారా సమీప ఆసుపత్రులకు తరలించారు. చికిత్స పొందుతూ ఓ వృద్ధ భక్తుడు మృతి చెందినట్లు సమాచారం. మరో నలుగురైదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మృతులు, గాయపడిన వారి సంఖ్యపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఘటన అనంతరం రథయాత్ర మార్గంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. అదనపు పోలీసు బలగాలను మోహరించి భక్తుల రాకపోకలను నియంత్రిస్తున్నారు. రద్దీ ప్రాంతాల్లో బ్యారికేడ్లను బలోపేతం చేసి, భక్తులు గుంపులుగా ఒకేసారి ముందుకు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

















