ప్రతిపక్షం, జూన్ 06: మహిళలు ధైర్యంగా ముందుకు వచ్చి అన్ని రంగాల్లో పనిచేసినప్పుడే సమాజం, దేశం వేగంగా అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర పోలీసు శాఖ అధిపతి సీవీ ఆనంద్ అన్నారు. మహిళల సాధికారత లక్ష్యంగా ప్రత్యేకంగా రూపొందించిన మహిళా రవాణా సేవల కార్యక్రమం ద్వారా పలువురికి శిక్షణ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు.
ఇప్పటికే 55 మంది మహిళలకు వాహనాల నడిపే శిక్షణ ఇచ్చి ప్రయాణికుల రవాణా సేవల్లో అవకాశం కల్పించామని పేర్కొన్నారు. గతంలో ఈ రంగంలో ఎక్కువగా పురుషులే ఉండేవారని, ఇప్పుడు మహిళలు కూడా సమర్థంగా రాణిస్తున్నారని చెప్పారు.
నగర పోలీసు చరిత్రలో తొలిసారిగా శాంతిభద్రతల పోలీసు స్టేషన్లకు మహిళా అధికారులను బాధ్యులుగా నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. భవిష్యత్తులో సరుకు రవాణా, పంపిణీ సేవలు, ఇతర రవాణా రంగాల్లో కూడా మహిళలకు మరిన్ని అవకాశాలు కల్పించే దిశగా చర్యలు చేపడతామని వెల్లడించారు.
దేశ ఆర్థికాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, కుటుంబ పరిమితులను దాటి అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు.















