ప్రతిపక్షం, జూలై 18: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏప్రిల్–జూన్ త్రైమాసికానికి సంబంధించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ ద్వారా ఒక్కో వినియోగదారుడి నుంచి నెలకు సగటున రూ.215 ఆదాయం వస్తున్నట్లు వెల్లడించింది. దీనినే ఏఆర్పీయూ (యూజర్ నుంచి సగటు ఆదాయం)గా పిలుస్తారు.
జియో మొత్తం వినియోగదారుల సంఖ్య 53.3 కోట్లకు చేరినట్లు కంపెనీ తెలిపింది. గతంతో పోలిస్తే సంస్థ ఆదాయం 9.2 శాతం పెరిగి, పన్నుల అనంతరం రూ.7,764 కోట్లకు చేరినట్లు వెల్లడించింది. వినియోగదారుల సంఖ్య, ఒక్కో కస్టమర్ నుంచి వచ్చే సగటు ఆదాయం పెరగడం జియో వ్యాపార వృద్ధికి కీలకంగా మారినట్లు కంపెనీ పేర్కొంది.

















