ప్రతిపక్షం, జూలై 18: తెలంగాణలోని పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పట్టణ పేదల కోసం హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో 2బీహెచ్‌కే తరహాలో ఇళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు ‘ఇందిరమ్మ పట్టణ గృహ నిర్మాణ’ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన అనుమతుల్లో జాప్యం లేకుండా చర్యలు తీసుకునేందుకు సింగిల్ విండో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ విధానం ద్వారా ప్లానింగ్, భవన నిర్మాణ అనుమతులు వేగంగా మంజూరు కానున్నాయి.
అలాగే ఈ పథకం కింద నిర్మించే ఇళ్లకు ప్లానింగ్, బిల్డింగ్ పర్మిషన్ ఛార్జీల నుంచి మినహాయింపు కల్పించనున్నారు. పట్టణ ప్రాంతాల్లో సొంతింటి కలను నెరవేర్చుకోవాలనుకునే పేదలకు ఈ పథకం ప్రయోజనం చేకూర్చనుంది.


















