ప్రతిపక్షం, జూలై 18: ‘ఎస్‌ఐఆర్’ ప్రక్రియలో భాగంగా ఓటర్ల జాబితా నుంచి పేరు తొలగించినంత మాత్రాన సంబంధిత వ్యక్తి పౌరసత్వం రద్దయినట్లు కాదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పౌరసత్వాన్ని తుది స్థాయిలో నిర్ధారించే రాజ్యాంగబద్ధ సంస్థ ఎన్నికల సంఘం కాదని వ్యాఖ్యానించింది.
పశ్చిమ బెంగాల్‌లో చేపట్టిన ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో ఓటు హక్కు కోల్పోయినవారు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ఓటర్ల జాబితాలో పేరు లేకపోవడం, పౌరసత్వం కోల్పోవడం రెండూ వేర్వేరు అంశాలని కోర్టు స్పష్టం చేసింది.
ఓటర్ల జాబితా నుంచి పేర్లు తొలగించబడిన వ్యక్తుల పౌరసత్వ హోదాను నిర్ధారించే ప్రక్రియ చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదించాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ, పౌరసత్వ నిర్ధారణకు సంబంధించిన అంశాలపై మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.


















