ప్రతిపక్షం, జూలై 18: పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటల్ తరగతి ప్రయోగ వాహనం ‘విక్రమ్-1’ను విజయవంతంగా పరీక్షించిన హైదరాబాద్‌కు చెందిన స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభినందనలు తెలిపారు. ‘మిషన్ ఆగమన్’లో భాగంగా నిర్వహించిన విక్రమ్-1 తొలి పరీక్షా ప్రయోగం విజయవంతం కావడం భారత అంతరిక్ష రంగ చరిత్రలో చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణకు గర్వకారణమని పేర్కొన్నారు.
దేశ అంతరిక్ష సాంకేతిక రంగంలో భారత్ సాధిస్తున్న పురోగతికి స్కైరూట్ ఏరోస్పేస్ విజయం నిదర్శనమని సీఎం అన్నారు. అంతరిక్ష అన్వేషణలో భారత యువ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు, ఆవిష్కర్తల ప్రతిభను ప్రపంచానికి చాటిచెప్పిన ఘనత స్కైరూట్‌కు దక్కిందని ప్రశంసించారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో శంషాబాద్‌లోని జీఎంఆర్ ఏరోస్పేస్ పార్క్‌లో ఉన్న స్కైరూట్ ఏరోస్పేస్ క్యాంపస్‌ను సందర్శించిన విషయాన్ని సీఎం గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా విక్రమ్-1 ప్రయోగానికి సంబంధించిన హార్డ్‌వేర్‌ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రానికి తరలించే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపారు.
విక్రమ్-1 విజయవంతమైన పరీక్షా ప్రయోగం తెలంగాణను ప్రపంచ స్థాయి ఏరోస్పేస్, అంతరిక్ష సాంకేతిక కేంద్రంగా తీర్చిదిద్దే దిశలో మరో కీలక మైలురాయిగా నిలిచిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. స్కైరూట్ వంటి సంస్థల విజయాలు రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు యువతలో శాస్త్ర, సాంకేతిక రంగాలపై ఆసక్తిని పెంచుతాయని, భావితరాల ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలకు స్ఫూర్తిగా నిలుస్తాయని అన్నారు.

















