ప్రతిపక్షం, జూలై 18: తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ పార్టీ బలోపేతంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పార్టీ ముఖ్య నేతలను వ్యక్తిగతంగా కలిసి వారి పనితీరు, పార్టీ అభివృద్ధికి చేసిన కృషిపై సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు.
సమావేశాల్లో భాగంగా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ అభివృద్ధి కోసం మీరు చేసిన కృషి ఏమిటి?, సంస్థాగతంగా చేపట్టిన కార్యక్రమాలేమిటి?, ప్రజల్లో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకున్న చర్యలేమిటి? వంటి ప్రశ్నలను నాయకులను అడుగుతున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని మినహాయించి మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు, కీలక పార్టీ నాయకులతో మీనాక్షి నటరాజన్ ఇప్పటికే విడివిడిగా సమావేశమై అభిప్రాయాలు తెలుసుకుంటున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఈ ప్రక్రియ అంతా అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) ఆదేశాల మేరకే జరుగుతోందని సమాచారం. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, పార్టీ సంస్థాగత పరిస్థితి, నాయకుల పాత్రపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి త్వరలో ఢిల్లీలోని పార్టీ అధిష్ఠానానికి సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
రాబోయే రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలు, పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణను దృష్టిలో ఉంచుకుని ఈ సమీక్ష చేపట్టినట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

















