ప్రతిపక్షం, జూలై 18: తెలంగాణ బీజేపీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొంతకాలంగా బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య కొనసాగుతున్న విభేదాలకు ఎట్టకేలకు తెరపడినట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ అభయ్ పాటిల్ సమక్షంలో ఇద్దరు నేతలు పరస్పరం షేక్‌హ్యాండ్ ఇచ్చుకుని ఆలింగనం చేసుకున్నారు.
బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ నివాసంలో జరిగిన భేటీలో ఇరువురు నేతలు సమావేశమయ్యారు. పార్టీ ప్రయోజనాల కోసం ఇకపై కలిసి పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు కాషాయ వర్గాలు వెల్లడించాయి. వ్యక్తిగత ప్రయోజనాల కంటే పార్టీ బలోపేతానికే ప్రాధాన్యం ఇస్తామని వారు స్పష్టం చేసినట్లు సమాచారం.
తెలంగాణ బీజేపీలో కీలక నేతలుగా ఉన్న బండి సంజయ్, ఈటల రాజేందర్ మధ్య కొంతకాలంగా నెలకొన్న విభేదాలు పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాజాగా జరిగిన ఈ భేటీతో ఇరువురు నేతల మధ్య సయోధ్య కుదిరినట్లు పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
















