ప్రతిపక్షం, జూలై 18: తెలంగాణలో ఆహార కల్తీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆహార భద్రతపై కీలక ఆదేశాలు జారీ చేశారు.
అపరిశుభ్రంగా నిర్వహిస్తున్న హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ తయారీ కేంద్రాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టి ఆహార నాణ్యతా ప్రమాణాలను ఉల్లంఘించే సంస్థలను గుర్తించాలని సూచించారు.
కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
















