మందుబాబులకు షాక్.. ఈ నెల 15 నుంచే మద్యం ధరల భారీ పెంపు?

ప్రతిపక్షం, జూన్ 06: తెలంగాణలో మద్యం ధరలు భారీగా పెరగనున్నాయి. మద్యం తయారీ సంస్థల విజ్ఞప్తులు, పెరిగిన ఉత్పత్తి వ్యయాల నేపథ్యంలో ప్రభుత్వం ధరల సవరణకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ నెల 15వ తేదీ నుంచి కొత్త ధరలు అమల్లోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.

ధరల పెంపుపై అధ్యయనం చేసేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ నివేదికను సమర్పించినట్లు సమాచారం. కమిటీ సిఫార్సుల మేరకు మద్యం ధరలను 10 నుంచి 15 శాతం వరకు పెంచే ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కొత్త ధరల ప్రకారం సాధారణ మద్యం బ్రాండ్ల ఫుల్ బాటిళ్లపై రూ.80 వరకు, ప్రీమియం బ్రాండ్లపై రూ.90 వరకు, ఖరీదైన బ్రాండ్లపై రూ.120 వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.

అయితే బీర్ ధరల్లో ప్రస్తుతం ఎలాంటి మార్పులు ఉండబోవని సమాచారం. గతంలోనే బీర్ ధరలను పెంచిన నేపథ్యంలో ఈసారి వాటిని యథాతథంగా ఉంచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మద్యం ధరల పెంపుతో ప్రభుత్వానికి ఏటా వేల కోట్ల రూపాయల అదనపు ఆదాయం లభించే అవకాశం ఉందని ఎక్సైజ్ శాఖ వర్గాలు భావిస్తున్నాయి. అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత కొత్త ధరలపై స్పష్టత రానుంది.

Spread the love

Related News

Latest News