ప్రతిపక్షం, జూన్ 06: తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. ఉమ్మడి పాలమూరు జిల్లా పర్యటన సందర్భంగా సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడిన సీఎం, పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి. ముఖ్యంగా “ఒకాయన గోచి కట్టుకొని రాజశేఖర్ రెడ్డి అనుకుంటాడు.. గోచి కట్టుకున్న వాళ్లందరూ రాజశేఖర్ రెడ్డిలు అయిపోతారా?” అని చేసిన వ్యాఖ్యలు వివిధ రాజకీయ అర్థాలకు కారణమయ్యాయి.
పాలమూరు ప్రాంతంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం ఈ వ్యాఖ్యలు చేయగా, కాంగ్రెస్ నాయకులు మాత్రం అవి మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డిని ఉద్దేశించినవేనని చెబుతున్నారు. గత కొంతకాలంగా సాగునీటి ప్రాజెక్టులు, రైతు సమస్యలపై ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నిరంజన్ రెడ్డికి సీఎం పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
అయితే ఈ వ్యాఖ్యలను బీఆర్ఎస్ మరో కోణంలో ప్రచారం చేస్తోంది. ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు నిజానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను ఉద్దేశించినవేనంటూ బీఆర్ఎస్ సామాజిక మాధ్యమ వేదికల్లో పోస్టులు పెడుతోంది. పంచెకట్టు, సంప్రదాయ దుస్తులతో తరచూ కనిపించే భట్టి విక్రమార్కను లక్ష్యంగా చేసుకునేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి.
ఈ అంశంపై సామాజిక మాధ్యమాల్లో రాజకీయ కార్యకర్తల మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ, అసలు వ్యాఖ్యల సందర్భాన్ని వక్రీకరిస్తున్నారని విమర్శిస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నేతలు సీఎం వ్యాఖ్యలు అధికార పార్టీలోనే అంతర్గత సంకేతాలను ఇస్తున్నాయని అంటున్నారు.
పాలమూరు పర్యటనలో ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, భూసేకరణ, రైతు ప్రయోజనాలపై సీఎం దృష్టి సారించినప్పటికీ, ఆయన చేసిన ఈ ఒక్క వ్యాఖ్య రాజకీయ వర్గాల్లో ప్రత్యేక చర్చకు కారణమైంది. ప్రస్తుతం ఈ అంశం కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మరో మాటల యుద్ధానికి దారితీసే అవకాశం కనిపిస్తోంది.
















