ప్రతిపక్షం, జూన్ 06: వికారాబాద్ జిల్లాలో కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు బాధ్యతలు చేపట్టి ఐదు నెలలు గడిచినా గౌరవ వేతనం అందక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత ఏడాది డిసెంబర్ 22న బాధ్యతలు స్వీకరించిన 594 మంది సర్పంచ్‌లకు ఇప్పటివరకు ఒక్క నెల వేతనం కూడా చెల్లించలేదని తెలుస్తోంది.
ప్రస్తుతం ఒక్కో సర్పంచ్‌కు నెలకు రూ.6,500 చొప్పున చెల్లించాల్సి ఉండగా, డిసెంబర్ నుంచి మే వరకు జిల్లాలో మొత్తం రూ.2.05 కోట్లకు పైగా గౌరవ వేతన బకాయిలు పేరుకుపోయాయి. బ్యాంకు ఖాతాల వివరాలు సేకరించినప్పటికీ చెల్లింపులపై ఎలాంటి స్పష్టత లేకపోవడంతో సర్పంచ్‌లలో ఆందోళన నెలకొంది.
అంతేకాకుండా పంచాయతీ సమావేశాలకు హాజరయ్యే వార్డు సభ్యులకు ఇవ్వాల్సిన సిట్టింగ్ ఫీజులు కూడా చెల్లించకపోవడంతో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
మరోవైపు గత పాలకవర్గాల సర్పంచ్‌లకు కూడా 18 నెలల గౌరవ వేతన బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని మాజీ సర్పంచ్‌లు చెబుతున్నారు. తమకు రావాల్సిన బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వం, పంచాయతీ శాఖ అధికారులను వారు కోరుతున్నారు.















