ప్రతిపక్షం, జూలై 18: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో భర్తను హత్య చేయించేందుకు ఓ మహిళ పన్నిన కుట్ర వెలుగులోకి వచ్చింది. ప్రియుడిని పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశంతో భర్తను తొలగించేందుకు ఆమె విషపూరితమైన కట్లపామును ఉపయోగించినట్లు పోలీసులు గుర్తించారు.
పోలీసుల వివరాల ప్రకారం.. మీరట్‌కు చెందిన అతుల్ (32) ఏడేళ్ల క్రితం దామిని (30)ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అతుల్ ఓ ప్రైవేట్ పాఠశాలను నిర్వహిస్తుండగా.. అదే పాఠశాల వ్యాన్ డ్రైవర్ తుషార్‌తో దామినికి వివాహేతర సంబంధం ఏర్పడినట్లు తెలుస్తోంది.
తుషార్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్న దామినికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించినట్లు పోలీసులు తెలిపారు. దీంతో అతుల్‌ను హత్య చేయాలని ఇద్దరూ కలిసి కుట్ర పన్నినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో అతుల్‌కు పాలలో మత్తుమందు కలిపి ఇచ్చిన అనంతరం.. పాములు పట్టేవారికి రూ.5 లక్షలు ఇచ్చి విషపూరితమైన కట్లపాముతో అతడిని కాటేయించినట్లు దర్యాప్తులో తేలినట్లు సమాచారం.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్యకు సంబంధించిన కుట్ర, ఆర్థిక లావాదేవీలు, నిందితుల పాత్రపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు.

















