పాలమూరు ప్రాజెక్టులపై సీఎం సుడిగాలి పర్యటన.. పనుల పురోగతిపై క్షేత్రస్థాయిలో సమీక్ష

ప్రతిపక్షం, జూన్ 06: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సాగు, తాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరుసగా రెండో రోజు క్షేత్రస్థాయిలో విస్తృత పర్యటన నిర్వహించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో పాటు జిల్లాలో కొనసాగుతున్న ప్రధాన నీటిపారుదల ప్రాజెక్టులను పరిశీలిస్తూ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం లేకుండా వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.

సోమశిల అతిథిగృహం నుంచి పర్యటన ప్రారంభించిన ముఖ్యమంత్రి ముందుగా కొల్లాపూర్ మండలంలోని ఎల్లూరు పంప్‌హౌస్‌ను సందర్శించారు. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగమైన ప్యాకేజీ–3 హెడ్ రెగ్యులేటర్, ప్యాకేజీ–2 నార్లాపూర్ రిజర్వాయర్, ప్యాకేజీ–1 డెలివరీ సిస్టర్న్, కల్వకుర్తి ఎత్తిపోతల పథకంలోని లిఫ్ట్–1 పంప్‌హౌస్ పనులను పరిశీలించారు. ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితి, నిర్మాణ దశలు, మిగిలిన పనులపై అధికారులను ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో కలిసి పర్యటించిన సీఎం, నార్లాపూర్ రిజర్వాయర్ పరిధిలో కొనసాగుతున్న పనులను ప్రత్యేకంగా పరిశీలించారు. ప్రాజెక్టుల నిర్మాణం ద్వారా భవిష్యత్తులో సాగునీటి సామర్థ్యం ఎంత మేర పెరుగుతుందనే అంశాలపై కూడా సమీక్ష నిర్వహించారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించిన సొరంగ మార్గంలోకి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం ప్రయాణించిన ముఖ్యమంత్రి, పంప్‌హౌస్ నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. సాంకేతిక సవాళ్లు, పనుల వేగం, నిధుల వినియోగం వంటి అంశాలపై అధికారులతో చర్చించి, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.

అనంతరం బిజినేపల్లి మండలం కుమ్మెరకు చేరుకున్న ముఖ్యమంత్రి, ప్యాకేజీ–8 స్టేజ్–3 పంప్‌హౌస్‌తో పాటు వట్టెం రిజర్వాయర్‌కు సంబంధించిన ప్యాకేజీలు 9, 10, 11 పనులను సమీక్షించారు. నిర్మాణ నాణ్యతలో ఎలాంటి రాజీ లేకుండా పనులు చేపట్టాలని స్పష్టం చేశారు.

తదుపరి హెలికాప్టర్ ద్వారా భూత్పూర్ మండలం కొత్తూరుకు చేరుకున్న సీఎం, కరివెన రిజర్వాయర్‌కు సంబంధించిన ప్యాకేజీలు 14, 15 పనులను పరిశీలించారు. అక్కడి నుంచి జడ్చర్ల మండలం ఉద్దండాపూర్ చేరుకుని ప్యాకేజీలు 17, 18 కింద కొనసాగుతున్న పనులను పరిశీలించారు. రిజర్వాయర్ నిర్మాణం, నీటి నిల్వ సామర్థ్యం, భూసేకరణ అంశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు.

ప్రతి ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనలను పరిశీలించిన ముఖ్యమంత్రి, ప్రాజెక్టుల పురోగతి, పూర్తి స్థాయికి చేరుకునే గడువులు, ఎదురవుతున్న సమస్యలపై సమగ్ర సమాచారం సేకరించారు. పనుల అమలులో ఉన్న అవరోధాలను వెంటనే తొలగించి, వేగవంతంగా ముందుకు సాగాలని అధికారులకు సూచించారు.

పర్యటన ముగింపులో కొత్తూరు వద్ద కరివెన రిజర్వాయర్ ప్రాంతంలో మీడియాతో మాట్లాడిన ముఖ్యమంత్రి, పాలమూరు ప్రాంతాన్ని సాగునీటి రంగంలో ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. జిల్లాలో కొనసాగుతున్న అన్ని ప్రధాన ప్రాజెక్టులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేసి రైతులకు సాగునీరు, గ్రామాలకు తాగునీరు అందించే దిశగా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం సహా అన్ని ప్రాజెక్టుల పనులను నిరంతరం పర్యవేక్షిస్తూ నిర్ణీత గడువులో పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వ్యవసాయ రంగానికి కొత్త ఊపిరి లభిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Spread the love

Related News

Latest News