- పోలీసు–న్యాయస్థానాల సమన్వయంతో ప్రతి కేసుకు సామరస్య పరిష్కారం
- కక్షలతో కాకుండా కలిసికట్టుగా ముందుకు సాగే సామరస్యానికి వేదిక లోక్ అదాలత్
- జూన్ 20 వరకు జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్ విజయవంతానికి ప్రత్యేక కార్యాచరణ: ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి: కళార్చన
ప్రతిపక్షం, జూన్ 06 , వనపర్తి ప్రతినిధి: వివాదాలు కొనసాగాలంటే జీవితకాలం పడుతుంది కానీ పరస్పర అవగాహనతో రాజీకి సిద్ధమైతే క్షణాల్లో పరిష్కారం లభిస్తుందని..ప్రజలకు సత్వర, సులభ, న్యాయం అందించడమే జాతీయ మెగా లోక్ అదాలత్ లక్ష్యమని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి.కళార్చన అన్నారు.శనివారం వనపర్తి జిల్లా న్యాయస్థానంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో జిల్లాలోని పోలీసు అధికారులు, కోర్టు సిబ్బందితో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి, ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి శ్రీమతి కళార్చన సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కళార్చన మాట్లాడుతూ.. జూన్-20వ తేదీ వరకు నిర్వహించనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. రాజీ పడదగిన కేసులను గుర్తించి కక్షిదారులకు లోక్ అదాలత్ ప్రయోజనాలను వివరించి, పరస్పర అవగాహనతో కేసుల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని ప్రజలకు న్యాయం త్వరగా అందాలంటే లోక్ అదాలత్‌లను విస్తృతంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె పేర్కొన్నారు. కోర్టుల్లో సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించడం ద్వారా కక్షిదారులకు మానసిక ప్రశాంతత లభించడంతో పాటు సమయం, ధనం, శ్రమ కూడా ఆదా అవుతాయని వివరించారు. క్రిమినల్ కంపౌండబుల్ కేసులు, కుటుంబ వివాదాలు, ఆస్తి తగాదాలు, రోడ్డు ప్రమాద పరిహార కేసులు, చెక్ బౌన్స్ కేసులు, బ్యాంకు రికవరీ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్, టౌన్ న్యూసెన్స్ తదితర కేసులను రాజీ మార్గంలో పరిష్కరించడం ద్వారా ప్రజల్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం మరింత బలోపేతం అవుతుందని ఆమె అన్నారు.పోలీసు అధికారులు, కోర్టు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ప్రతి కక్షిదారునికి లోక్ అదాలత్ ద్వారా లభించే ప్రయోజనాలను వివరించాలని సూచించారు.రాజీ ద్వారా పరిష్కారం సాధ్యమయ్యే ప్రతి కేసును జాతీయ మెగా లోక్ అదాలత్‌కు తరలించేలా ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరారు.లోక్ అదాలత్‌లు కేవలం కేసుల పరిష్కార వేదికలు మాత్రమే కాకుండా, సమాజంలో శాంతి, సామరస్య వాతావరణం నెలకొల్పే ప్రజా న్యాయ వేదికలని ఆమె పేర్కొన్నారు. కోర్టుల చుట్టూ తిరుగుతూ న్యాయం కోసం ఎదురుచూసే సామాన్య ప్రజలకు ఇది ఒక గొప్ప అవకాశమని, అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయమూర్తులు కవిత, కార్తీక్ రెడ్డి, శ్రీలత, అశ్విని, వనపర్తి డీఎస్పీ గిరిబాబు, వనపర్తి సీఐ సుగంధరత్నం, ఆత్మకూరు సీఐ. శివకుమార్, జిల్లాలోని ఎస్సైలు, కోర్టు కానిస్టేబుళ్లు సిబ్బంది మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.















