ప్రతిపక్షం, జూన్ 08: ఇద్దరు అవివాహిత వయోజనులు పరస్పర అంగీకారంతో శారీరక సంబంధం పెట్టుకుంటే దానిని నైతికంగా లేదా చట్టపరంగా తప్పుగా పరిగణించలేమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
తెలంగాణకు చెందిన గాజుల తిరుపతి ట్రైనీ పోలీస్ కానిస్టేబుల్‌గా ఎంపికైనప్పటికీ, 2014లో ఓ మహిళతో వివాహానికి ముందు శారీరక సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో అతడికి పోస్టింగ్ నిరాకరించబడింది. ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
కేసును విచారించిన సుప్రీంకోర్టు, పరస్పర అంగీకారంతో ఇద్దరు వయోజనుల మధ్య జరిగిన వ్యక్తిగత సంబంధాన్ని వ్యక్తి నైతికత లేదా క్యారెక్టర్‌ను అంచనా వేయడానికి ప్రమాణంగా ఉపయోగించరాదని స్పష్టం చేసింది.
వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఇలాంటి అంశాల ఆధారంగా ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలను నిరాకరించడం సమంజసం కాదని కోర్టు అభిప్రాయపడింది. దీంతో గాజుల తిరుపతికి అనుకూలంగా తీర్పు వెలువడింది.
ఈ తీర్పు వ్యక్తిగత స్వేచ్ఛ, గోప్యత హక్కులు మరియు వయోజనుల వ్యక్తిగత నిర్ణయాల విషయంలో కీలక మార్గదర్శకంగా పరిగణించబడుతోంది.

















