ప్రతిపక్షం, జూన్ 08: తెలంగాణలో రాజకీయ వాగ్వాదాలు మరింత ముదురుతున్న వేళ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై పార్లమెంట్ సభ్యురాలు డీకే అరుణ తీవ్రస్థాయిలో స్పందించారు. తెలంగాణలో ఎవరైనా స్వేచ్ఛగా తిరిగే హక్కు ఉందని, రాష్ట్రం ఎవరి సొంత ఆస్తి కాదని ఆమె పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి తమను తెలంగాణలో తిరగనివ్వమని చెప్పే అధికారం లేదని ప్రశ్నించిన డీకే అరుణ, రాజకీయ విభేదాల పేరుతో బెదిరింపు ధోరణి సరికాదన్నారు. పదవిలోకి రాకముందు రాజకీయాలకు దూరంగా ఉంటానన్న రేవంత్ రెడ్డి, ఇప్పుడు పూర్తిగా రాజకీయాలకే పరిమితమయ్యారని విమర్శించారు.
కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణకు దిగిన గత ప్రభుత్వానికి ఎదురైన పరిణామాలను గుర్తు చేస్తూ, అదే మార్గంలో నడిస్తే ప్రస్తుత ప్రభుత్వానికీ ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి హద్దులు దాటి మాట్లాడితే తాము కూడా అదే స్థాయిలో స్పందించాల్సి వస్తుందని స్పష్టం చేశారు.
ప్రధానిని కలిసేందుకు అవకాశం ఇవ్వడం లేదంటూ ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలు వాస్తవాలకు దూరమని డీకే అరుణ పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ పార్టీ ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని, అలాంటప్పుడు ఇతరులపై విమర్శలు చేయడం తగదన్నారు.
తెలంగాణ అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వ సహకారం కీలకమని, కేంద్ర నిధులు లేకుండా రాష్ట్రంలోని అనేక అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు సాగలేవని ఆమె అభిప్రాయపడ్డారు. కేంద్రం–రాష్ట్రం పరస్పర సహకారంతో పనిచేస్తేనే ప్రజలకు మేలు జరుగుతుందని డీకే అరుణ పేర్కొన్నారు.
















