కవిత వ్యాఖ్యలపై రఘునందన్‌రావు ఫైర్.. వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలి

ప్రతిపక్షం, జూన్ 08: సంగారెడ్డిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితపై తీవ్ర విమర్శలు చేశారు. తనను జహీరాబాద్ ఎంపీగా పేర్కొంటూ కవిత చేసిన వ్యాఖ్యలు అవివేకానికి నిదర్శనమని, తాను మెదక్ ఎంపీ అన్న విషయం కూడా తెలియకుండా మాట్లాడడం ఆశ్చర్యకరమని అన్నారు.

జహీరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ తీసుకొస్తానని తాను హామీ ఇచ్చినట్లు కవిత చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. ఇతరులను విమర్శించే ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు అమలయ్యాయో పరిశీలించాలని సూచించారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో సింగూరు ప్రాజెక్టు మరమ్మతులపై కేసీఆర్ చేసిన హామీలను గుర్తు చేసిన రఘునందన్ రావు, అధికారంలో ఉన్నప్పుడు వాటిని ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకత్వం ప్రజలకు ఇచ్చిన అనేక హామీలు నెరవేర్చలేదని ఆరోపించారు.

తాను ఎవరితోనూ రాజీ రాజకీయాలు చేయడం లేదని స్పష్టం చేసిన ఆయన, బీఆర్ఎస్ పార్టీ నిధులు, ఆ పార్టీ నాయకుల రాజకీయ సంబంధాలపై కూడా ప్రశ్నలు లేవనెత్తారు. గతంలో జాగృతి సంస్థను నడిపిన కవితకు, ప్రస్తుతం రాజకీయాల్లో ఉన్న కవితకు చాలా తేడా కనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

తెల్లాపూర్‌ను ఆదర్శ ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని గతంలో చెప్పిన కవిత, ఆ హామీని అమలు చేయడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రజలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని చెప్పిన వాగ్దానాలు కూడా అమలుకు నోచుకోలేదని ఆరోపించారు.

ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై సమాధానం చెప్పాల్సింది బీఆర్ఎస్ నాయకులేనని, వాస్తవాలను పక్కనపెట్టి రాజకీయ విమర్శలు చేయడం సరైంది కాదని రఘునందన్ రావు పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News