ప్రతిపక్షం, జూన్ 08: ఖమ్మం జిల్లాలోని వెంకటాయపాలెం గ్రామంలో పశువైద్య ఆసుపత్రిని ప్రారంభించిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ గ్రామానికి ప్రత్యేక చరిత్ర ఉందని, గతంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు ఇది కేంద్రంగా నిలిచిందని గుర్తు చేశారు.
గ్రామంలో చేపట్టే ప్రతి అభివృద్ధి పని దీర్ఘకాల ప్రయోజనం కలిగేలా ఉండాలని అధికారులకు సూచించారు. భూ సర్వే ప్రక్రియను వేగవంతం చేసి సమస్యలను పరిష్కరించాలని కోరారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
వెంకటాయపాలెం గ్రామాన్ని తన శక్తి మేరకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. గ్రామ ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని పేర్కొన్నారు.
















