ఎబోలా అప్రమత్తత: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్ కట్టుదిట్టం – మంత్రి దామోదర్

హైదరాబాద్, ప్రతిపక్షం, జూన్ 08: ఎబోలా వైరస్ వ్యాప్తిపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయంలో స్క్రీనింగ్, సర్వైలెన్స్‌ను మరింత కట్టుదిట్టం చేసినట్లు వెల్లడించారు.

సచివాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, ఎబోలా ప్రభావిత దేశాల నుంచి వచ్చే ప్రయాణికులను 21 రోజులపాటు పర్యవేక్షించనున్నట్లు చెప్పారు. అనుమానితులుగా గుర్తించిన ఇద్దరికి ఎబోలా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినప్పటికీ, మరోసారి నమూనాలను పరీక్షకు పంపినట్లు వివరించారు.

గాంధీ ఆస్పత్రిలో ప్రత్యేక ఐసోలేషన్ సదుపాయాలు సిద్ధంగా ఉంచామని, ఎబోలా నిర్ధారణకు అవసరమైన టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి వచ్చాయని తెలిపారు. తప్పుడు చిరునామాలు ఇచ్చే ప్రయాణికులపై ఎపిడెమిక్ డిసీజెస్ చట్టం కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విమానాశ్రయంలో ఫ్రెంచ్, అరబిక్, స్వాహిలి భాషలు తెలిసిన సిబ్బందిని ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం ఆరోగ్య, పోలీసు, విమానాశ్రయ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో ఎబోలా నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందకుండా అధికారిక సమాచారం మాత్రమే నమ్మాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ సూచించారు.

Spread the love

Related News

Latest News