ప్రతిపక్షం, జూన్ 09: జనగామ జిల్లా చిల్పూర్ మండలం పల్లగుట్టలో నిర్వహించిన కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బీఆర్ఎస్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర మంత్రివర్గం నిరంతరం శ్రమిస్తుంటే, బీఆర్ఎస్ నేతలు నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. పదేళ్ల పాలనలో సన్నబియ్యం ఇవ్వని బీఆర్ఎస్ ఇప్పుడు విమర్శలు చేయడం విడ్డూరమన్నారు.
ధనిక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణను బీఆర్ఎస్ నాయకులు దోచుకున్నారని, పేదల సొమ్మును దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగిస్తోందని చెప్పారు. ఇప్పటికే 76 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశామని, రైతుల కోసం రుణమాఫీతో పాటు తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం వడ్ల కొనుగోళ్లలో సహకరించడం లేదని భట్టి విమర్శించారు. రైతులు కార్పొరేట్ సంస్థలపై ఆధారపడే పరిస్థితిని కేంద్రం సృష్టిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉచిత విద్యుత్ ఇచ్చినప్పటికీ డిస్కమ్‌లకు బకాయిలు చెల్లించలేదని, ప్రస్తుతం తమ ప్రభుత్వం వాటిని చెల్లిస్తూ వ్యవస్థను గాడిలో పెడుతోందని వివరించారు.
దేవాదుల ప్రాజెక్టును గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, త్వరలోనే ఆ పనులను పూర్తి చేస్తామని భట్టి హామీ ఇచ్చారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, రఘునాథపల్లిలో 230 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటును పరిశీలిస్తామని తెలిపారు.

















