- రూ. 2.5 కోట్ల విలువైన సీఎంఆర్ ధాన్యం పక్కదారి పట్టినట్లు అంచనా
- శ్రీ సాంబశివ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో రాష్ట్ర టాస్క్ ఫోర్స్ బృందం, జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు
- తనిఖీల్లో వెలుగు చూసిన అక్రమాలు
- మరికొన్ని మిల్లర్లపై తనిఖీలు కొనసాగితే బయటపడనున్న అక్రమాలు
ప్రతిపక్షం, జూన్ 10, వనపర్తి ప్రతినిధి: జిల్లాల్లో రైస్ మిల్లర్లు పక్కా ప్రణాళికతో కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) ధాన్యాన్ని పక్కదారి పట్టిస్తున్నారు. మిల్లర్లు ప్రతి సీజన్లోనూ ఇలాగే చేస్తున్నా.. సంబంధిత అధికార యంత్రాంగం సరైన సమయంలో తనిఖీలు నిర్వహించకపోవడంతో రూ.కోట్ల విలువైన ధాన్యం దారిమళ్లుతోంది. ఈ విషయాన్ని సీరియ్‌సగా తీసుకున్న రాష్ట్ర టాస్క్ ఫోర్స్ బృందం ఓ రైస్ మిల్లుపై తనిఖీలు నిర్వహించి సీఎంఆర్ కుంభకోణాన్ని వెలికితీశారు.వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మీరాసిపల్లి (మీరాస్పల్లి) గ్రామంలోని శ్రీ సాంబశివ ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులో మంగళవారం రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ బృందం, హైదరాబాద్ అధికారులు, జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో మిల్లు రికార్డులను, నిల్వలను పరిశీలించిన అధికారులకు భారీ షాక్ తగిలింది. మిల్లులో ఉండాల్సిన 25,426 బస్తాల సీఎంఆర్ (కస్టమ్ మిల్ల్డ్ రైస్) ధాన్యం మాయమైనట్లు, దానిని పక్కదారి పట్టించినట్లు అధికారులు పక్కాగా నిర్ధారించారు. బహిరంగ మార్కెట్లో ఈ మాయమైన ధాన్యం విలువ సుమారు రూ.2.5 కోట్లు ఉంటుందని అధికారులు వెల్లడించారు.
25,426 బస్తాల సీఎంఆర్ ధాన్యం మాయం
కొత్తకోట మండలం, మిరాసిపల్లి శ్రీ సాంబశివ ఆగ్రో ఇండస్ట్రీస్ మిల్లుపై రాష్ట్ర టాస్క్ ఫోర్స్ బృందం నిర్వహించిన తనిఖీల్లో 25,426 బస్తాల ధాన్యం పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. వీటి విలువ రూ. 2.5కోట్ల ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
వేరే మిల్లుకు ధాన్యం అప్పగింత..
అక్రమాలు బయటపడటంతో టాస్క్‌ఫోర్స్ అధికారులు అక్కడికక్కడే పంచనామా నిర్వహించారు. అనంతరం మిల్లులో మిగిలి ఉన్న మిగతా ధాన్యాన్ని భద్రతా పరిరక్షణ చర్యల్లో భాగంగా.. రాయినిపేటలోని ‘ఎంఎస్ ఏకేఆర్ ఇండస్ట్రీస్’ యాజమాన్యానికి తక్షణమే అప్పగించారు.ఈ భారీ కుంభకోణానికి సంబంధించిన పూర్తి నివేదికను, సదరు మిల్లు యజమానిపై చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు వీలుగా జిల్లా అదనపు కలెక్టర్ కు సమర్పించారు.ఉన్నతాధికారుల తదుపరి ఆదేశాల మేరకు సంబంధిత మిల్లర్‌పై కఠిన చర్యలు చేపట్టనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
తదుపరి టార్గెట్ ఏ మిల్లో ?
ఈ మెరుపు దాడితో వనపర్తి జిల్లాలోని రైస్ మిల్లర్లలో ఒక్కసారిగా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.రాష్ట్ర టాస్క్‌ఫోర్స్ తనిఖీలు ఇలాగే కొనసాగితే ఏ క్షణంలో ఏ మిల్లుపై దాడులు జరుగుతాయో, ఎవరి అక్రమాలు బయటపడతాయోనని కొందరు అక్రమార్క మిల్లర్ల గుండెల్లో రైల్లు పరిగెడుతున్నాయి.


















