ప్రతిపక్షం, జూన్ 11: రాష్ట్రంలో కురిసిన తొలి వర్షాలకే ప్రభుత్వం చేతులెత్తేసిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్‌లో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసమర్థ పాలనే కారణమని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించాల్సిన వ్యక్తి తన విధులను విస్మరించారని, మున్సిపల్ పరిపాలనపై దృష్టి సారించడం లేదని అన్నారు.
రాజధానిలో మౌలిక సదుపాయాల అభివృద్ధి కంటే విలువైన భూముల వ్యవహారాలపైనే ప్రభుత్వం దృష్టి పెట్టిందని కేటీఆర్ విమర్శించారు. భారీ వర్షాలతో నగరంలోని పలు ప్రాంతాలు జలమయం కావడం, ట్రాఫిక్ సమస్యలు తలెత్తడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని పేర్కొన్నారు. హైదరాబాద్ ప్రజలను ఇబ్బందుల్లోకి నెట్టిన ప్రభుత్వానికి రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. నగరాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.

















