సింగరేణిని దోచుకుంటున్న ప్రభుత్వం: బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్

ప్రతిపక్షం, జూన్ 09: సింగరేణి సంస్థను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని, కానీ అదే ప్రభుత్వం సంస్థను దోచుకుంటోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ తీవ్ర ఆరోపణలు చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ సింగరేణిలో బొగ్గు నిల్వలపై ప్రభుత్వం తప్పుదారి పట్టించే ప్రకటనలు చేస్తోందన్నారు.

జూన్ 5 నాటికి 26.28 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని అధికారులు చెబుతుండగా, వాటిని ప్రజలకు చూపించాలని మంత్రి శ్రీధర్ బాబుకు సవాల్ విసిరారు. బుధవారం ఇద్దరమే కలిసి వెళ్లి బొగ్గు నిల్వలను పరిశీలిద్దామని, నిల్వలు లేకపోతే ప్రభుత్వం తన తప్పును ఒప్పుకోవాలని డిమాండ్ చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాతే సింగరేణి వ్యవహారాల్లో రాజకీయ జోక్యం పెరిగిందని గంగుల ఆరోపించారు. ప్రస్తుతం సంస్థలో ఉద్యోగులకు జీతాలు చెల్లించలేని పరిస్థితి నెలకొందని, దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరారు. అలాగే రూ.4 వేల కోట్ల ఓవర్‌డ్రాఫ్ట్ ఎందుకు తీసుకున్నారో వెల్లడించాలని డిమాండ్ చేశారు.

సింగరేణిలో బొగ్గు నిల్వలు, ఆర్థిక పరిస్థితులపై సీబీసీఐడీ విచారణ జరిపించాలని ఆయన కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కారుణ్య నియామకాల ద్వారా 16 వేల మందికి ఉద్యోగాలు కల్పించామని, ఇప్పుడు వేలాది మంది ఉద్యోగుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సింగరేణి పరిస్థితిపై స్పష్టత ఇవ్వాలని గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు.

Spread the love

Related News

Latest News