ప్రతిపక్షం, జూన్ 10: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రాన్ని మార్ఫింగ్ చేసి, ఆయన మాట్లాడినట్లుగా అసత్య వ్యాఖ్యలతో వీడియో రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేసిన ఘటనపై సైబరాబాద్ సైబర్ నేర విభాగం పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే ఉద్దేశంతో ఈ వీడియోను ప్రసారం చేసినట్లు అధికారులు భావిస్తున్నారు.
ఈ నెల 6న విధుల్లో ఉన్న ఉప నిరీక్షకుడు జయప్రకాశ్ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న వీడియోను గుర్తించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ముఖ్యమంత్రి చిత్రాన్ని సాంకేతికంగా మార్పులు చేసి, వాస్తవానికి విరుద్ధమైన వ్యాఖ్యలను జోడించి వీడియో రూపొందించినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం.
ప్రజల్లో గందరగోళం సృష్టించడం, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అవకాశాలు ఉండటంతో ఈ వ్యవహారాన్ని అధికారులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. వీడియోను రూపొందించిన వ్యక్తులు, దానిని ప్రచారం చేసిన ఖాతాల వివరాలను గుర్తించే పనిలో దర్యాప్తు బృందాలు నిమగ్నమయ్యాయి.
సామాజిక మాధ్యమాల్లో అసత్య ప్రచారం, మార్ఫింగ్ వీడియోల వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. అధికారికంగా ధృవీకరించని సమాచారాన్ని నమ్మకూడదని, అలాంటి పోస్టులను పంచుకోవడం కూడా చట్టపరమైన సమస్యలకు దారితీయవచ్చని హెచ్చరించారు.

















