- బినామీ ఖాతాల ద్వారా అక్రమ కమీషన్ల వసూళ్ల ఆరోపణలు
ప్రతిపక్షం బ్యూరో,కరీంనగర్, జూన్ 10: కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న శ్రీమతి దనుక రాధికను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అధికారిక విధుల నిర్వహణలో తన హోదాను దుర్వినియోగం చేస్తూ, కాంట్రాక్టర్ల బిల్లుల క్లియరెన్స్‌ను వేగవంతం చేయడానికి బినామీ ఖాతాల ద్వారా అక్రమ కమీషన్లు వసూలు చేసినట్లు ఏసీబీ దర్యాప్తులో వెల్లడైంది. ఏసీబీ వివరాల ప్రకారం, ఐసీడీఎస్ గుడ్లు, పప్పు, ఇతర సరుకుల సరఫరాదారుల నుంచి లంచాలు డిమాండ్ చేసిన రాధిక, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు మరియు కుటుంబ సభ్యుల ఖాతాల ద్వారా యూపీఐ లావాదేవీల రూపంలో ఆ మొత్తాలను స్వీకరించినట్లు గుర్తించారు. అలాగే ఈ లావాదేవీలకు సహకరించేలా అవుట్సోర్సింగ్ సిబ్బందిపై అనవసర ఒత్తిడి తెచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి.జూన్ 2022 నుంచి ఏప్రిల్ 2024 వరకు వివిధ దశల్లో రూ.2.37 లక్షలకుపైగా అక్రమ మొత్తాలు స్వీకరించినట్లు ఏసీబీ అధికారులు నిర్ధారించినట్లు సమాచారం. ఈ చర్యల ద్వారా ప్రభుత్వ విధులను నిజాయితీకి విరుద్ధంగా నిర్వహించి అక్రమ ప్రయోజనం పొందినట్లు కేసు నమోదు చేశారు. నిందిత అధికారిని అరెస్టు చేసి కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తున్నట్లు అధికారులు తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, భద్రతా కారణాల దృష్ట్యా ఫిర్యాదుదారు వివరాలను గోప్యంగా ఉంచినట్లు వెల్లడించారు.

















