ఉద్యమకారుల భూపోరాటానికి కవిత పిలుపు.. జులై 2న ఉప్పల్‌లో భారీ కార్యక్రమం

ప్రతిపక్షం, జూన్ 11: తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీల అమలుకోసం జులై 2న ఉప్పల్ భగాయత్ ప్రాంతంలో భూపోరాటం నిర్వహించనున్నట్లు తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయంలో ఉద్యమకారుల భూపోరాట పోస్టర్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు.

తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులకు 250 గజాల భూమి కేటాయిస్తామని ప్రభుత్వం గతంలో హామీ ఇచ్చిందని, అయితే ఇప్పటికీ ఆ హామీ అమలులో జాప్యం జరుగుతోందని కవిత విమర్శించారు. వెంటనే అర్హులైన ఉద్యమకారులను గుర్తించి వారికి భూములు కేటాయించాలని డిమాండ్ చేశారు.

జులై 2న నిర్వహించే భూపోరాటంలో భాగంగా ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే కార్యక్రమం చేపడతామని ప్రకటించారు. ఈ ఉద్యమానికి అన్ని వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువత, మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ కోసం తమ జీవితాలను అంకితం చేసిన ఉద్యమకారులకు న్యాయం చేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ప్రస్తుతం తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించిన కవిత, అలాంటి కుట్రలను ప్రజల ఐక్యతతో తిప్పికొట్టాలని అన్నారు. ఉద్యమకారుల సంక్షేమం కోసం చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం చారిత్రక బాధ్యతగా భావించాలని పిలుపునిచ్చారు.

ఉద్యమకారుల హక్కుల సాధన, వారికి ఇచ్చిన హామీల అమలు కోసం ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసిన కవిత, తెలంగాణ కోసం పోరాడిన వారికి గౌరవం, గుర్తింపు, న్యాయం లభించే వరకు తమ ఉద్యమం ఆగదని పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News