నిరుద్యోగ యువతతో ప్రభుత్వం మోసం చేస్తోంది: హరీశ్‌రావు

ప్రతిపక్షం, జూన్ 11: రాష్ట్రంలో పోలీసు ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం నిరుద్యోగ యువతను మోసం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. పోలీసు శాఖలో వేలాది ఖాళీలు ఉన్నప్పటికీ వాటన్నింటినీ భర్తీ చేయకుండా పరిమిత సంఖ్యలోనే నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేయడం అన్యాయమని విమర్శించారు.

రాష్ట్రంలో సుమారు 19 వేల పోలీసు ఖాళీలు ఉన్నాయని, అయితే కేవలం 5 వేల పోస్టులకే నోటిఫికేషన్ జారీ చేయడం వల్ల ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువత తీవ్ర నిరాశకు గురవుతున్నారని పేర్కొన్నారు. ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను ఒకేసారి భర్తీ చేసేలా ప్రభుత్వం వెంటనే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే గతంలో అమలులో ఉన్న వయోపరిమితి నిబంధనలను పునరుద్ధరించాలని హరీశ్‌రావు కోరారు. నియామక ప్రక్రియలో జాప్యం కారణంగా వయోపరిమితి దాటిన అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

నిరుద్యోగ యువత న్యాయమైన డిమాండ్ల సాధన కోసం బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చిన హరీశ్‌రావు, ఉద్యోగాల భర్తీ విషయంలో ప్రభుత్వం స్పష్టమైన కార్యాచరణతో ముందుకు రావాలని డిమాండ్ చేశారు. యువత భవిష్యత్తుతో ఆటలాడకుండా ఖాళీ పోస్టులన్నింటినీ భర్తీ చేసే దిశగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.

Spread the love

Related News

Latest News