భారత్ ఫ్యూచర్ సిటీతో తెలంగాణ భవిష్యత్‌కు బలమైన పునాది: రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 11: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అభివృద్ధి చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టుకు మరో కీలక మైలురాయి చేరుకుంది. రికార్డు స్థాయిలో కేవలం 150 రోజుల్లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అథారిటీ భవనాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఫ్యూచర్ సిటీకి సంబంధించిన ప్రత్యేక అంతర్జాల వేదికను ఆవిష్కరించి ప్రజలకు అంకితం చేశారు. ఈ సందర్భంగా శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఫ్యూచర్ సిటీ అభివృద్ధి అథారిటీ పరిధిలోకి మరికొన్ని గ్రామాలను చేర్చేందుకు ముఖ్యమంత్రి సూత్రప్రాయ ఆమోదం తెలిపారు. ఆయా గ్రామాల ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులు, గ్రామ పంచాయతీల తీర్మానాలను పరిశీలించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పటికే కొన్ని గ్రామాలను సూచనప్రాయంగా ఫ్యూచర్ సిటీలో చేర్చామని, మిగతా గ్రామాల విషయంలో గ్రామాల వారీగా చర్చలు నిర్వహించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఫ్యూచర్ సిటీ దేశానికే కాదు, ప్రపంచానికి కూడా ఆదర్శ నగరంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరం ముత్యాల నగరంగా, సరస్సులు–శిలల నగరంగా గుర్తింపు పొందినట్లే, ఫ్యూచర్ సిటీ ప్రపంచంలోనే అత్యుత్తమ కాలుష్యరహిత నగరంగా అవతరిస్తుందని చెప్పారు. నెట్ జీరో సిటీగా, పర్యావరణ హిత నగరంగా దీనిని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని వివరించారు.

స్థానిక ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు ఫ్యూచర్ సిటీ కార్యాలయం కీలక కేంద్రంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. తాను తరచూ కార్యాలయాన్ని సందర్శిస్తానని, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు వారానికోసారి వచ్చి స్థానికుల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కార చర్యలు చేపడతారని తెలిపారు.

ఫ్యూచర్ సిటీ కేవలం ప్రస్తుత తరానికే కాకుండా భవిష్యత్ తరాలకు కూడా ఒక గొప్ప వారసత్వంగా నిలవాలని ప్రభుత్వం సంకల్పించిందని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణను 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడంలో ఫ్యూచర్ సిటీ కీలక పాత్ర పోషించాల్సి ఉందన్నారు. రాబోయే ఎనిమిదేళ్లలో ఈ నగరాన్ని ప్రపంచంలోని ప్రముఖ నగరాల సరసన నిలిపే విధంగా ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు.

ఫ్యూచర్ సిటీలో హరిత ఔషధ పరిశ్రమలు, క్రీడా కేంద్రాలు, విద్యా సంస్థలు, వైద్య సేవల సముదాయాలు, కృత్రిమ మేధస్సు కేంద్రాలు, డేటా కేంద్రాలు, ప్రపంచ స్థాయి సేవా సంస్థలు, అంతర్జాతీయ దిగ్గజ సంస్థలను ఆకర్షించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. దీనివల్ల లక్షలాది మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

వచ్చే ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సును కూడా ఫ్యూచర్ సిటీలోనే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి వెల్లడించారు. ప్రపంచ దేశాల నుంచి పెట్టుబడులను ఆకర్షించి తెలంగాణను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా నిలపాలన్నదే లక్ష్యమన్నారు.

అలాగే హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఎదురైన ఇబ్బందులను ప్రస్తావిస్తూ, చెరువులు, కుంటలు, వాగులు, నాలాల ఆక్రమణలే వరద సమస్యలకు ప్రధాన కారణమని పేర్కొన్నారు. అందుకే అక్రమ నిర్మాణాల తొలగింపు, జలవనరుల పునరుద్ధరణ కార్యక్రమాలను ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోందని స్పష్టం చేశారు. తెలంగాణ భవిష్యత్ అభివృద్ధికి ఫ్యూచర్ సిటీ ఒక దిక్సూచిగా నిలుస్తుందని, జూన్ 10 తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే రోజుగా గుర్తుండిపోతుందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

Spread the love

Related News

Latest News