మెట్రో ఫుట్‌పాత్‌లపై దుకాణాల ఏర్పాటుపై హైకోర్టు ఆగ్రహం

ప్రతిపక్షం, జూన్ 11: హైదరాబాద్ మెట్రో స్టేషన్ల కింద ఉన్న ఫుట్‌పాత్‌లపై దుకాణాలు, స్టాళ్ల ఏర్పాటుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. పాదచారుల కోసం ఉద్దేశించిన మార్గాలను లీజుకు ఎలా కేటాయించారంటూ సంబంధిత అధికారులను ప్రశ్నించింది. ప్రజలకు సౌకర్యంగా ఉండాల్సిన ఫుట్‌పాత్‌లు వ్యాపార కార్యకలాపాలకు వేదికగా మారడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

ఈ అంశంపై అందిన ఫిర్యాదులపై ఇప్పటివరకు తీసుకున్న చర్యల పూర్తి వివరాలను సమర్పించాలని జీహెచ్‌ఎంసీ, మెట్రో రైలు సంస్థ అధికారులను హైకోర్టు ఆదేశించింది. ఫుట్‌పాత్‌లపై దుకాణాలు ఏర్పాటుచేయడం వల్ల పాదచారులు రోడ్లపై నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని, దీంతో ప్రమాదాల ముప్పు కూడా పెరుగుతోందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

నగరంలో పాదచారుల హక్కులను పరిరక్షించడం స్థానిక సంస్థల బాధ్యత అని పేర్కొన్న న్యాయస్థానం, ప్రజా మార్గాల వినియోగంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. ఈ వ్యవహారంపై తదుపరి విచారణలో అధికారులు సమగ్ర నివేదిక సమర్పించాలని హైకోర్టు స్పష్టం చేసింది.

Spread the love

Related News

Latest News