•పిల్లలందరినీ ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి ఉన్నత చదువులు చదివించాలి : రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి
•ప్రతి ఒక్కరూ ఐదు చెట్లు నాటి పర్యావరణాన్ని సంరక్షించాలి : జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
•జయన్న తిరుమలాపూర్ గ్రామంలో ప్రత్యేక గ్రామ సభ నిర్వహణ
•రూ. 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభం
ప్రతిపక్షం, జూన్ 10, వనపర్తి ప్రతినిధి: రైతులు ఎప్పుడూ ఒకే పంట వేయకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని,ఎరువులను కూడా మోతాదుకు మించి వాడకుండా నేలలను సంరక్షించుకునే చర్యలను చేపట్టాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి పేర్కొన్నారు.బుధవారం గోపాల్ పేట మండలం జయన్న తిరుమలాపూర్ గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక లో భాగంగా ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల్ల చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా మండల స్థాయి అధికారులు రోడ్డు భద్రత, బాల్యవివాహాల నిర్మూలన, వర్షాకాలం నేపథ్యంలో ఇంకుడు గుంతల ఏర్పాటు, పంట మార్పిడి, ఎరువుల వాడకం, పరిసరాల పరిశుభ్రత, వన మహోత్సవం, జల సంరక్షణ, పాఠశాలల్లో సౌకర్యాలు సహా తదితరాంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు జిల్లెల చిన్నారెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రణాళిక అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి గ్రామసభ తిరుమలపురం గ్రామంలోనే నిర్వహించడం జరిగింది, చివరి గ్రామ సభను కూడా మన గ్రామంలోనే నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.రైతులు ఎప్పుడూ ఒకే పంట వేయకుండా పంట మార్పిడి విధానాన్ని అవలంబించాలని, ఎరువులను కూడా మోతాదుకు మించి వాడకుండా నేలలను సంరక్షించుకునే చర్యలను చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఎల్నినో ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకొని రైతులు వ్యవసాయ పనులను ప్రారంభించుకోవాలన్నారు. ఎరువులు అత్యధికంగా వినియోగించడం వల్ల భూములలో సారవంతం తగ్గి భవిష్యత్తులో ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని తెలిపారు.కాబట్టి ఎరువులు మోతాదుకు మించి వినియోగించకుండా జాగ్రత్త పడాలి అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవడం కోసం ప్రతి ఒక్కరూ 5 చెట్లు నాటాలని సూచించారు. అంతేకాకుండా చెట్లను నరికి వేయడం కూడా ఆపాలని సూచించారు. కరెంటు, నీటిని వృధా చేయకుండా జాగ్రత్త పడాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గ్రామాల్లో మద్యపాన నిషేధాన్ని అమలు పరచాలని, ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని సూచించారు. ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేక శ్రద్ధ చూపిస్తుందని ప్రతి ఒక్కరూ తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఐటిఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ వంటి నూతన కోర్సులను అందుబాటులోకి వచ్చిందని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇందిరమ్మ ఇండ్ల ద్వారా పేదల సొంతింటి కల నెరవేరుస్తుందన్నారు.
- ప్రతి ఒక్కరూ ఐదు చెట్లు నాటి పర్యావరణాన్ని సంరక్షించాలి :జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మొట్టమొదటి గ్రామసభ తిరుమలపురం గ్రామంలోనే నిర్వహించడం జరిగింది, చివరి గ్రామ సభను కూడా గ్రామంలోనే నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.ఉపాధి హామీ కింద గ్రామస్థులు అందరూ తమ ఇళ్ల వద్ద పంచాయతీ కార్యదర్శిని సంప్రదించి ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవడం ద్వారా గ్రామంలో భూగర్భ జలాలు పెరిగి మంచినీటి సదుపాయాలు కలుగుతాయి అన్నారు. అదేవిధంగా గ్రామంలో గత ఐదేళ్ల వ్యవధిలో 18 ఏళ్ల నుండి 59 ఏళ్లలోపు వ్యక్తులు ఎవరైనా మరణిస్తే జాతీయ కుటుంబ ప్రయోజన పథకం ద్వారా దరఖాస్తు చేసుకొని రూ. 20 వేల లబ్ధి పొందవచ్చని తెలిపారు. ప్రభుత్వం అర్హులైన ఓటర్లందరినీ జాబితాలో చేర్చేందుకు ప్రత్యేక ఓటర్ జాబితా సవరణ కార్యక్రమం నిర్వహిస్తుందని ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని అధికారులకు సహకరించాలని సూచించారు. ప్రస్తుతం జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలు ఉన్నాయని కాబట్టి తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించి చదివించాలని సూచించారు. అమ్మాయిలకు బాల్యవివాహాలు చేయకుండా ఉన్నత చదువులు చదివించాలని తెలిపారు.ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చాయని కాబట్టి ప్రభుత్వ పాఠశాలల్లోనే పిల్లలను చేర్పించాలని విజ్ఞప్తి చేశారు. త్వరలోనే ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఉదయం అల్పాహారం కూడా అందించనుందని తెలిపారు. అందరూ హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతా నియమాలను పాటించాలన్నారు. రైతులు పంటమార్పిడి విధానాలు అవాలంభించాలని సూచించారు. సన్న రకం వరిని వేయడానికి మొగ్గు చూపించాలని సూచించారు. వ్యర్థాల నిర్వహణపైన కూడా అవగాహనా కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా తిరుమలాపూర్ గ్రామంలో రూ. 10 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సీసీ రోడ్లను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రారంభించారు. గ్రామసభలో ముఖ్య అతిథుల చేతుల మీదుగా ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. కార్యక్రమం లో సర్పంచ్ జ్యోతి గోపాల్, నాయకులు యాదయ్య, జిల్లా బీసీ సంక్షేమ అధికారి మూజహిద్, మండల స్థాయి అధికారులు, ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.


















