హైదరాబాద్‌లో వరదలు… బీఆర్‌ఎస్ సమాధానం చెప్పాలి: సీఎం రేవంత్ రెడ్డి

ప్రతిపక్షం, జూన్ 11: హైదరాబాద్‌లో ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా తలెత్తిన ట్రాఫిక్ సమస్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. కేవలం రెండు గంటలపాటు కురిసిన వర్షానికే నగరంలోని ప్రధాన రహదారులు స్తంభించిపోయాయని, వర్షపు నీరు రోడ్లపై వరదలా ప్రవహించిందని పేర్కొన్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, కొద్ది కిలోమీటర్ల దూరం ప్రయాణించడానికి కూడా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టిందని తెలిపారు.

గత పదేళ్లలో నగరాన్ని అభివృద్ధి చేశామని చెప్పుకునే వారు ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితులకు సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి డిమాండ్ చేశారు. వర్షపు నీరు రోడ్లపైకి రావడానికి, ట్రాఫిక్ సమస్యలు తీవ్రరూపం దాల్చడానికి కారణాలు ఏమిటో ప్రజలకు వివరించాలని అన్నారు. చెరువులు, కుంటలు, కాలువలు, నాలాల ఆక్రమణలు నగరంలో వరద సమస్యలను మరింత పెంచాయని పేర్కొన్నారు.

నగర మౌలిక సదుపాయాల ప్రణాళికలో జరిగిన లోపాల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని ముఖ్యమంత్రి విమర్శించారు. భవిష్యత్తులో ఇటువంటి సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోందని, జలమార్గాల పునరుద్ధరణతో పాటు అక్రమ నిర్మాణాల తొలగింపుపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌ను వరదల సమస్య నుంచి శాశ్వతంగా విముక్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

Spread the love

Related News

Latest News